High blood pressure (hypertension) reasons in Telugu

హైపర్‌టెన్షన్‌ (hypertension).. ప్రస్తుతం చాలా మంది ఎదుర్కొంటోన్న ఆరోగ్య సమస్యల్లో ఇదీ ఒకటి. సాధారణ రక్తపోటు 120/80. అయితే, 140/90 కన్నా ఎక్కువ రక్తపోటు దీర్ఘకాలికంగా ఉన్నప్పుడు హైపర్‌టెన్షన్ గా సూచిస్తారు.దీని కారణంగా మీ గుండె, రక్త నాళాలు రక్తాన్ని పంప్ చేయడానికి ఎక్కువగా కష్టపడవలసి ఉంటుంది. దీనివల్ల గుండె పోటు వంటి ప్రాణాంతక అనారోగ్యాల బారిన పడే ముప్పు ఎక్కువగా ఉంటుంది. అయితే ఇది రావడానికి సరైన కారణాలు గుర్తించిన తర్వాత, రక్తపోటును (blood pressure) నియంత్రించడం సులభతరం అవుతుంది.

హైపర్‌టెన్షన్ దోహదపడే కారణాలు ఈ వీడియో లో తెలుసుకుందాము

 

High blood pressure (hypertension) reasons in Telugu

జన్యుపరమైన అంశాలు: కొంతమంది వ్యక్తులు వారి తల్లిదండ్రుల నుండి జన్యుపరమైన అసాధారణతలను వారసత్వంగా పొందుతారు. ఇటువంటి జన్యుపరమైన అంశాలు అధిక రక్తపోటుకు దారితీయొచ్చు.

వయసు మీదపడడం: వయస్సు పెరిగేకొద్దీ, రక్త నాళాలు మరియు ధమనులు క్రమంగా గట్టిపడటం వల్ల రక్తపోటు ప్రమాదం కూడా పెరుగుతుంది. వయస్సు-సంబంధిత మార్పుల కారణంగా తగ్గిన శారీరక శ్రమ మరియు బరువు పెరగడం ఈ ప్రమాదానికి మరింత దోహదం చేస్తాయి. 65 మరియు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వ్యక్తులు ఎక్కువ ప్రమాదంలో ఉంటారు.

ఊబకాయం: 30 కంటే ఎక్కువ బాడీ మాస్ ఇండెక్స్ ఉన్న వాళ్ళు దీని వల్ల రక్తపోటు ప్రమాదంలో పడతారు. అధిక శరీర బరువు రక్త నాళాలను ఒత్తిడి చేయడం ద్వారా రక్తపోటు ప్రమాదాన్ని పెంచుతుంది.

ఆల్కహాల్‌ ఎక్కువగా తీసుకోవడం: రెగ్యులర్ గా మరియు అధికంగా ఆల్కహాల్ తీసుకోవడం రక్తపోటు వచ్చే ప్రమాదాన్ని పెంచుతుంది.

శారీరక శ్రమ లేకపోవడం : నిశ్చల జీవనశైలిని గడపడం, శారీరక శ్రమ లేకపోవడం నేటి ఆధునిక సమాజంలో సర్వసాధారణంగా మారింది. వీరికి రక్తపోటు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉన్నట్టే.

మధుమేహం: మధుమేహం తో బాధపడే వ్యక్తులు కూడా అంతర్లీన జీవక్రియ అసాధారణతల కారణంగా అధిక రక్తపోటు వచ్చే ప్రమాదంలో ఉంటారు

ఉప్పు అధికంగా తీసుకోవడం: అధిక సోడియం తీసుకోవడం రక్తపోటుకు ప్రధాన ప్రమాద కారకం. ప్రిజర్వేటివ్స్, పికిల్స్ , జంక్ ఫుడ్ , ఉప్పుతో కూడిన ప్రాసెస్ చేసిన ఆహారాలో అధిక మొత్తంలో సోడియం ఉంటుంది. ఇవి అధిక రక్తపోటుతో పాటు కిడ్నీ సమస్యలు, మధుమేహం ప్రమాదాన్ని పెంచుతాయి.

ఒత్తిడి: ప్రతీ ఒక్కరూ కాలంతో పరుగులు పెడుతున్న నేటికాలంలో ఒత్తిడి సర్వసాధారణ విషయమైపోయింది. ఇలాగే ఒత్తిడిలోనే ఎక్కువ కాలం గడిపేవారికి భవిష్యత్తులో హైపర్‌టెన్షన్‌ సమస్యలు తప్పవని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ధూమపానం: ‘ధూమపానం ఆరోగ్యానికి హానికరం’ అనే సంగతి అందరికీ తెలిసిందే. దీనివల్ల ఊపిరితిత్తుల క్యాన్సర్ మాత్రమే కాకుండా హైపర్‌టెన్షన్‌ సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది

నిద్రలో సరిగ్గా ఊపిరి అందకపోవడం వల్ల: రకరకాల స్లీపింగ్ డిసార్డర్స్ వల్ల సరిగ్గా నిద్ర పోలేకపోతే అది డయాబెటీస్, బ్లడ్ ప్రెషర్ ఇష్యూస్ వంటివాటికి కారణం కావచ్చు. స్లీప్ యాప్నియా నిద్రకి సంబంధించిన ఒక బ్రీథింగ్ డిజార్డర్. ఇందువల్ల నిద్రలో శ్వాస తీసుకోవడం కొన్ని సెకన్ల పాటూ ఆగిపోతుంది. ఇలా రాత్రంతా జరుగుతూనే ఉంటుంది. ఇది హైపర్‌టెన్షన్‌ సమస్య కి ముఖ్య కారణం .

దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధి :ఏ కారణంగా అయినా, దీర్ఘకాలికంగా మూత్ర పిండాల సమస్య ఉన్నా.. వారికి అధిక రక్తపోటు ఉంటుంది.

హైపర్ థైరాయిడిజం మరియు హైపోథైరాయిడిజంతో సహా థైరాయిడ్ రుగ్మతలు హార్మోన్ల సమతుల్యతను దెబ్బతీస్తాయి మరియు రక్తపోటును పెంచుతాయి.
కొన్ని మందుల వల్ల కూడా అధిక రక్తపోటు కలుగవచ్చు. నాన్‌స్టెరాయిడ్ యాంటీ ఇన్‌ఫ్లమేటరీ డ్రగ్స్, గర్భనిరోధకాలు వంటి కొన్ని మందులు రక్తపోటును ప్రేరేపించగలవు.
కొకైన్ మరియు కొన్ని అక్రమ మందులు వంటి పదార్ధాలు రక్తపోటు స్థాయిలను తీవ్రంగా పెంచుతాయి.
మూత్రపిండాల వద్ద ఉండే, అడ్రినల్ గ్రంధులలో పెరిగే ఒక కణితి వల్ల కూడా అధిక రక్తపోటు సంభవించవచ్చు.
మందులతో పాటు ఆరోగ్యకరమైన ఆహారం, క్రమం తప్పకుండా వ్యాయామం, సోడియం తక్కువగా తీసుకోవడం, బరువును కంట్రోల్‌లో ఉంచుకుంటే అధిక రక్తపోటు కంట్రోల్‌లో ఉంటుంది.

Scroll to Top